Telugu Gateway
Cinema

‘సైరా’ వివాదంలో కొత్త ట్విస్ట్

‘సైరా’ వివాదంలో కొత్త ట్విస్ట్
X

టాలీవుడ్ సినిమాలు విడుదలకు ముందు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. తాజాగా ‘వాల్మీకి’ సినిమా టైటిల్ వివాదం హైకోర్టుకెక్కగా..చివరి నిమిషంలో అంటే విడుదలకు కొన్ని గంటల ముందే సినిమా పేరును గద్దలకొండ గణేష్ గా మార్చారు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహరెడ్డి కూడా విడుదలకు ముందుకు చిక్కుల్లో పడినట్లే కన్పిస్తోంది. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా అసలు సైరా బయోపిక్ కాదని కోర్టుకు నివేదించారు. దీంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. తొలి స్వాతంత్ర్య సమరయయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తొలి నుంచి ప్రకటిస్తూ వచ్చారు. చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులతో చర్చలు జరిపి..కథకు సంబంధించి కొత్త మొత్తం కూడా ఆఫర్ చేశారు. అయితే ముందు చెప్పినట్లుగా తమకు సాయం చేయలేదని ఆరోపిస్తూ ఆయన వారసులు చివరకు కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు చరణ్ కార్యాలయం ముందు కూడా పలు మార్లు ధర్నాలకు దిగిన విషయం తెలిసిందే.

అదే సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిలుపుదల చేయాలని పిటీషనర్లు కోరారు. అయితే సెన్సార్ బోర్డు మాత్రం తాము ఇంకా సర్టిఫికెట్ ఇవ్వలేదని..సోమవారం తమ నిర్ణయం వెల్లడిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దొరవారి దస్తగిరిరెడ్డితోపాటు మరో నలుగురు పిటీషన్ దాఖలు చేశారు. అంతా సాఫీగా సాగి విడుదలకు ముందు ఈ వివాదం చెలరేగటం చిరు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమాను దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం. చిరు సరసన ఈ సినిమాలో నయనతార నటించారు. అమిత్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన వారిలో ఉన్నారు.

Next Story
Share it