Telugu Gateway
Politics

ఆర్ధిక నేరాల్లో ముందస్తు బెయిల్ హక్కు కాదు

ఆర్ధిక నేరాల్లో ముందస్తు బెయిల్ హక్కు కాదు
X

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి చిక్కులు వీడటం లేదు. అయన జైలు నుంచి బయటకు వచ్చేందుకు ప్రస్తుతానికి దారులు మూసుకుపోయాయి. దీనికి కారణం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ కు సుప్రీంకోర్టులో గురువారం నాడు చుక్కెదురు అయింది. ఐఎన్‌ఎక్స్‌ మనీల్యాండరింగ్‌ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. చిదంబరంను ఈ కేసులో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్‌ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

అయితే చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన రెగ్యులర్‌ బెయిల్‌ కోసం స్వేచ్ఛగా ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇది కొంతలో కొంత ఆయనకు ఊరటలాంటిదనే చెప్పొచ్చు. ఇక అన్ని న్యాయస్థానాల్లో ఆయన మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రీ డీ కె శివకుమార్ కూడా ఈడీ కేసులో అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదంతా రాజకీయ వేధింపుల్లో భాగమే అని శివకుమార్ ఆరోపిస్తున్నారు.

Next Story
Share it