Telugu Gateway
Politics

రేవంత్ కు షాక్..హుజూర్ నగర్ సీటు ఆమెకే

రేవంత్ కు షాక్..హుజూర్ నగర్ సీటు ఆమెకే
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ లో తన అభ్యర్ధి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రకటించి రేవంత్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అధిష్టానం అనుమతి లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ సీటుకు పద్మావతి పేరును ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతే కాదు ఈ అంశంపై తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాకు ఫిర్యాదు కూడా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నల్లగొండ జిల్లా నేతలు అంతా ఏకం అయిన ఉత్తమ్ కే మద్దతు పలికారు. ఈ తరుణంలో అధిష్టానం పద్మావతి ఉత్తమ్ పేరునే అభ్యర్ధిగా ప్రకటించింది. ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డకి షాక్ లాంటిదే. అనవసరంగా రేవంత్ ఈ వివాదంలో దూరి తన ప్రతిష్టను తానే తగ్గించుకున్నట్లు అయిందనే అభిప్రాయం సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఉత్కంఠగా సాగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు మంగళవారం నాడు కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు అయ్యారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికే ఈ సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పద్మావతి పేరును ఖరారు చేసినట్లు సమాచారం అందజేశారు. గత ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీచేసిన ఓటమి పాలయ్యారు. ఈ సీటులో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందటంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. దీంతో అధిష్టానం ఈ సీటును ఉత్తమ్ కుటుంబానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story
Share it