Telugu Gateway
Politics

కెసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్

కెసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్
X

హైదరాబాద్ లోని చారిత్రక ఎర్రమంజిల్ భవనాలను కూల్చేసి అక్కడ కొత్తగా అసెంబ్లీ భవనం నిర్మించాలన్న కెసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం కెసీఆర్ ఇఫ్పటికే ఎర్రమంజిల్ లో శంకుస్థాపన కూడా చేశారు. అసలు డిజైన్లు...ప్లాను ఏమీ లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని విచారణ సమయంలో కూడా హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణానికి వీలుగా తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది.

మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో సరిపోయిన అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రానికి సరిపోదా?. కొత్త అసెంబ్లీ అసవరం ఏముందని అంటూ విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేసినా సరే తెలంగాణ సర్కారు మాత్రం ససేమిరా అంటూ ముందుకెళ్ళటానికే నిర్ణయించుకుని చకచకా నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలటంతో మరి రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహం అనురిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it