Telugu Gateway
Andhra Pradesh

రివర్స్ టెండర్ తో 58 కోట్లు ఆదా

రివర్స్ టెండర్ తో 58 కోట్లు ఆదా
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా నీచ రాజకీయాలు చేయటం మాత్రం ఆపటం లేదన్నారు. ఇంత కాలం అదే పని చేశారని..ఇకనైనా ఈ పనులు ఆపాలని హితవు పలికారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా గతం కంటే 20.33 శాతం మిగులు లభించిందని, మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని టెండర్లలో రివర్స్‌ టెండరింగ్‌ అమలుచేస్తామని అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ శనివారం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు తన హయాంలో మాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీకి ఈ పనులు కట్టబెట్టారని, ఇప్పుడు అదే కంపెనీ వాళ్లు 15.7 శాతం తక్కువ ధరకు టెండర్లు వేసి.. ఈ పనులను సొంతం చేసుకున్నారని మంత్రి వివరించారు. నవంబర్‌లోపు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు 20వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రూ. 300 కోట్ల పనుల్లో రూ. 60 కోట్లు ఆదా అయిందని, ఈ లెక్కన గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వానికి కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తప్పుబట్టారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అవినీతిరహితంగా, అత్యంత పాదర్శకంగా పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ, ఉద్యోగాల విషయంలోనూ ఆయన చీప్‌గా ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. ‘70 ఏళ్ళు వచ్చాయి.. గత 40 ఏళ్లలో ఎన్నో దుర్మాగాలు చేశావు.. ఇప్పటికీనా బుద్ధి మార్చుకో’ అని బాబుకు సూచించారు. ఇలాగే ప్రవర్తిస్తే.. భవిష్యత్తులో చంద్రబాబు రాజకీయ మనుగడ కూడా కోల్పోతారని హెచ్చరించారు.

Next Story
Share it