Telugu Gateway
Politics

రేవంత్ ‘దూకుడు’ వెనక కారణమేంటి?!

రేవంత్ ‘దూకుడు’ వెనక కారణమేంటి?!
X

రేవంత్ రెడ్డి. గత కొంత కాలంగా పీసీసీ అధ్యక్ష పదవి రేసులో బాగా విన్పించిన పేరు. అదుగో నిర్ణయం..ఇవిగో ఆదేశాలు అంటూ వార్తలు వచ్చాయి. ఆ ఆదేశాలు అయితే రాలేదు కానీ సడన్ గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ‘దూకుడు’ ఫెంచారు. అది కూడా సొంత పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించటం ప్రారంభించారు. ఓ వైపు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయటంతోపాటు..మరో వైపు శాసనసభలో సిఎల్పీ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కను కూడా టార్గెట్ చేశారు. ఒకేసారి ఇద్దరు కీలక నేతలను రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు?. కాంగ్రెస్ ను వీడే ఆలోచనలో ఉన్నారా?. లేక అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నారా?. రేవంత్ రెడ్డి తాజా దూకుడు వెనక వ్యూహం ఏంటి? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు అన్నీ నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఓ వైపు తెలంగాణలో బిజెపి దూకుడు పెంచుతుండటంతో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఒకింత గందరగోళంలో పడ్డాయి. ఓ వైపు అత్యంత కీలకమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా తెలంగాణలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ పెట్టి సర్కారును ఇరకాటంలో పెట్టింది అన్న అంశం ఒక్కటి కూడా లేకపోవటం పార్టీకి నష్టం చేసేదే అన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా..ధీటుగా సభలో మాట్లాడే నాయకుడు లేకుండా పోవటం కూడా పెద్ద మైనస్ గా మారిందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచటం వెనక కారణాలు ఏంటా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి తెలంగాణలో ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా, కుంతియా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయి చర్చించటం..ఏఐసీసీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలని నిర్ణయించటం రేవంత్ కు మైనస్ గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టి బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందా? అన్న అంశంపై కూడా కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it