భాషా..ఒక్కసారి చెపితే..!
రజనీకాంత్..ఓ సినిమాలో భాషా ఒక్క సారి చెపితే వందసార్లు చెప్పినట్లే అనే డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. అదే భాషా..రజనీకాంత్ ఇప్పుడు హిందీ భాషకు సంబంధించి రియాక్ట్ అయ్యారు. హిందీని జాతీయ భాషగా చేయాలని..ఒకే దేశం..ఒకే భాష అంశాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ మండిపడుతున్నాయి. ఈ అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు రాకపోయినా..ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ లో మాత్రం రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాజాగా రజనీకాంత్ ఈ అంశంపై స్పందించారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్న షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు.
హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించబోరని రజనీకాంత్ స్పష్టం చేశారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదన్నారు. కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నాయి. హోం మంత్రి ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఇప్పటికే స్టాలిన్, కమల్ హాసన్, మమతా బెనర్జీ వంటి పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.