అచ్చెన్నాయుడు..నన్నపనేనిపై కేసు నమోదు

ఏపీలో ఒకటే రాజకీయ రచ్చ. ఏపీలో ఎన్నికలు రేపోమాపో అన్నట్లు ఉంది వాతావరణం. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుందో అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటు ప్రతిపక్షం..అటు అధికార పక్షం రెండూ అవసరానికి మించి దూకుడు చూపిస్తున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు పాలన కంటే రాజకీయంపైనే ఎక్కువ చర్చ సాగుతోంది. చలో ఆత్మకూరు పిలుపు సందర్భంగా దూకుడు ప్రదర్శించిన నేతలపై పోలీసుల కేసులు నమోదు అయ్యాయి. మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్,టిడిపి సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదు అయింది. తనను కులం పేరుతో దూషించారని మహిళా ఎస్.ఐ అనూరాద పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రాజకుమారిపై కేసు నమోదు అయింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.
చలో ఆత్మకూరు సందర్భంగా ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన‍్నపనేని దూషించారని ఆ ఎస్.ఐ. ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎస్ ఐ కూడా మీలాగా మాకు ఊరికే ఏమీ రాలేదు..కష్టపడితే ఉద్యోగాలు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. మరో నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అదికారుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న పిర్యాదుతో ఆయనపై కూడా కేసు పెట్టారు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాఠిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్‌ఐ కోటయ్య ఫిర‍్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.



