Telugu Gateway
Telangana

డీఎస్ సంచలన వ్యాఖ్యలు

డీఎస్ సంచలన వ్యాఖ్యలు
X

రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంచుమించు పార్టీ టీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిన తరహాలో మాట్లాడారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ కవిత, నిజామాబాద్‌ నేతలు రాసిన లేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పందించాలని డిమాండ్‌ చేశారు. తాను తప్పు చేస్తే చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే తనపై ఆరోపణల లేఖను ఉపసంహరణ చేసుకోవాలన్నారు. ఏడాదిన్నర అవుతున్నా టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి స్పందన కరువైందని.. ప్రజలు అన్ని విషయాలను, అందరినీ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా వారికి తెలుసు అన్నారు. బీజేపీలో చేరికపై స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి చేరమని ఆహ్వానాలు వస్తున్నాయన్నారు. తన కొడుకు అరవింద్ నిజామాబాద్‌ బీజేపీ ఎంపీగా గెలుపొందినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

ఎవరి రాజకీయాలు వారికే ఉన్నాయన్నారు. ‘అమిత్‌షాను పార్లమెంట్‌లో కలిశాను. దేశ హోంమంత్రితో చాలా విషయాలు చర్చించాను. హోంమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీలో చేరతానని అనుకుంటే ఎలా? ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావటానికి చాలా కష్టపడ్డారు. ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది.. రాజకీయంగా ఎంతో గుర్తింపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని వదిలి పెట్టడమే ఆశ్చర్యకరమైన చర్య. ప్రత్యేక పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింద’ని డీఎస్‌ వెల్లడించారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళతారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో రాజకీయమంతా ఆసక్తికరంగా ఉందన్నారు. బీజేపీ నేతలు తెలంగాణను టార్గెట్ చేశారని.. ఎవరు విజయవంతం అవుతారనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Next Story
Share it