మెఘా కూడా ఇక జాతి నిర్మాణంలో భాగస్వామా?
మెఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా రేపటి నుంచి జాతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు అయ్యామని..ఏకంగా 629 కోట్ల రూపాయల తక్కువకు పనిచేస్తున్నామని చెప్పుకుంటుందా?. చంద్రబాబు హయాంలో చూస్తే పట్టిసీమ దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్టులోనూ దగ్గర దగ్గరగా ఐదు శాతం ఎక్సెస్ కు టెండర్లు..అంతా గూడుపుఠాణిగా పనులు దక్కించుకున్న ఈ సంస్థ సడన్ గా ఎందుకు సడన్ గా ‘జాతి నిర్మాణం’లో భాగస్వామి కావాలని నిర్ణయించుకుంది. గత ప్రభుత్వంలో ప్రతి పనిని అంచనా విలువ కంటే ఎక్సెస్ కే టెండర్లు వేసి దక్కించుకున్న ఈ సంస్థ అకస్మాత్తుగా అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువకు ఎందుకు వేసింది?. ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా అందినంత దండుకోవటానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు. కానీ సడన్ గా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వ సొమ్ము ఆదా చేసేందుకు ఈ సంస్థ ఎందుకు నడుం కట్టినట్లు?. దీని వెనక ఉన్న అర్ధం ఏంటి?.
జగన్ సర్కారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 4987 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పిలిపిన ప్రధాన డ్యామ్, విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించి 12.6 శాతం తక్కువ కు కోట్ చేయటం విశేషం. దీని వల్ల ఏకంగా 629 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని సర్కారు చెబుతోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం కూడా కూడా సింగిల్ టెండర్ కు ఓకే చేయటం నిబంధనలకు వ్యతిరేకం. మరి తన జీవోను తానే ఉల్లంఘించి జగన్ సర్కారు ఇరకాటంలో పడుతుందా?. ఇంత భారీ మొత్తంలో విలువతో కూడిన పనులు దక్కించుకోవటానికి మెఘా తప్ప మరో ఇతర సంస్థ ఏదీ ముందుకు రావటం వెనక కారణం ఏంటి?. కేవలం మెఘా ఇంజనీరింగ్ ఒక్కటే బిడ్ దాఖలు చేయటం..దానిని సర్కారు ఆమోదించటం చూస్తుంటే అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనే అనుమానాలు వ్యక్తం కావటం సహజం. తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకూ ఎక్సెస్ కు తప్ప పనులు చేయని మెఘా ఎందుకు సడన్ గా ఎందుకింతలా మారిపోయింది?.
పోలవరం పనులు దక్కించుకునేందుకు ప్రీ బిడ్ సమావేశానికి వచ్చిన పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, షాంఘై ఎలక్ట్రిక్ మెషినరీ కంపెనీ, మెఘా ఇంజనీరింగ్, ఆఫ్కాన్స్, బిహెచ్ఈఎల్, రిత్విక్ ప్రాజెక్ట్స్, బీకెమ్ ఇండియా, జీఈ పవర్ ఇండియాల్లో ఒక్క మెఘా తప్ప మిగిలిన సంస్థలు ఎందుకు బిడ్స్ దాఖలు చేయలేదు?. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఒక్కటే సంస్థ బిడ్ దాఖలు చేయటంతో రివర్స్ టెండరింగ్ కు ఛాన్సే లేకుండా పోయిందని, ప్రస్తుత ప్రాజెక్టు పరిస్థితిని గమనంలోకి తీసుకుని మెఘాకు పనులు అప్పగించటమే సరైన నిర్ణయం అని భావిస్తున్నట్లు అని సర్కారు తన నోట్ లో పేర్కొంది. సాంకేతిక అంశాలు అన్ని పూర్తయిన వెంటనే మెఘా ఇంజనీరింగ్ పనులు ప్రారంభిస్తుందని చెబుతున్నారు.