Telugu Gateway
Andhra Pradesh

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కలకలం

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కలకలం
X

కోడెల శివప్రసాద్ రావు. 2014 సంవత్సరం ముందు వరకూ ఓ లెజెండరీ క్యారెక్టర్. రాజకీయంగా ఆయనపై విమర్శలు ఎన్ని ఉన్నా కూడా కోడెల ఇమేజ్ రాజకీయంగా చాలా మందిలో ఓ రేంజ్ లో ఉంటుంది. ఉమ్మడి ఏపీలో కూడా కోడెల శివప్రసాద్ రావు ఓ సీనియర్ నేతగా..ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. కానీ 2014 ఎన్నికల అనంతరం కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ కావటం...అక్కడ నుంచి ఆయన ప్రతిష్ట మసకబారటం ప్రారంభం అయిందని చెప్పొచ్చు. సభలో విషయాల సంగతి ఎలా ఉన్నా..ముఖ్యంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యంతో ఆయన పరువు, ప్రతిష్టలు ఒక్కసారిగా గంగలో కలిశాయనే చెప్పొచ్చు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం ఆయనపై వచ్చినన్ని విమర్శలు..కుటుంబ సభ్యులపై దాఖలైన కేసులు కోడెల పరువును అమాంతం తీసేశాయి. చివరకు అసెంబ్లీ ఫర్నీచర్ ను కూడా అక్రమంగా ఇంటికి..కొడుకు షోరూమ్ కు తరలించారనే విమర్శలు ఆయన్ను అభిమానించేవారిని సైతం షాక్ కు గురిచేశాయనే చెప్పకతప్పదు. ఫలితాల అనంతరం నేరుగా కోడెలపై తీవ్ర విమర్శలు..కుటుంబ సభ్యులపై కేసులు. ఈ తరుణంలో రాజకీయంగా ఒత్తిడి..ప్రజల్లో పలుచన కావటంతోఆయన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ఈ తరుణంలో 72 సంవత్సరాల వయస్సులు కోడెల శివప్రసాద్ రావు లాంటి నేత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి..ఒత్తిడి అంటే ఊహించటం కష్టమే. కానీ అదే జరిగిందని ప్రాధమిక సమాచారం. హైదరాబాద్ లోని నివాసంలో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే ఆయన్ను బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

కోడెల శివప్రసాద్ 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్‌ విజయలక్ష్మీ ఉన్నారు. ఓ కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వృత్తిరిత్యా డాక్టర్‌ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా, హోంమంత్రిగా సేవలందించారు. కోడెల అనుమానాస్పద మృతి కారణంగా గుంటూరు జిల్లా నరసారావుపేట డివిజన్‌లో 144 సెక్షన్‌ విధించారు. ముందుజాగ్రత్తగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story
Share it