అధికారిక అంత్యక్రియలకు కోడెల కుటుంబం నో
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చుట్టూ రాజకీయమే నడుస్తోంది. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడెల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి సూచించారు. మంగళవారం రాత్రి కోడెల కుమార్తె విజయలక్ష్మి తన తండ్రి మరణనికి సర్కారు వేధింపులే కారణం అని ఆరోపించారు. అంతే కాదు..కోడెలతోపాటు తనను, తన సోదరుడిని కూడా సర్కారు వేధించిందని ఆమె పోలీసులకు పిర్యాదు చేశారు.
ఈ తరుణంలో బుధవారం నాడు జరిగే అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలను అనుమతించబోమని కోడెల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు నరసరావుపేటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కోడెల అంతిమ యాత్ర సందర్భంగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.