కోడెల పులి అయితే..చంద్రబాబు నక్క
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కోడెల నాని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడెల పల్నాడు పులి అయితే..చంద్రబాబు నక్క అని వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. నాని వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘నక్క పులిని కూడా ఎలా మోసం చేస్తుంది. తన నక్క జిత్తులతో. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను కూడా ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేసి..ఆయన్ను పదవి నుంచి దించి ఆయన చావుకు కారణం అయిన వ్యక్తి చంద్రబాబు. చనిపోయాక సింహం దగ్గర కూర్చుని దొంగ ఏడ్పులు ఏడ్చి మహానుభావుడు అంటూ శవయాత్రలో పాల్గొన్న వ్యక్తి చంద్రబాబు. హరిక్రిష్ణకు మంత్రి పదవి ఇచ్చినా ..సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడె కోడెల విషయంలో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం కోడెలను వేధిస్తుందని..అక్రమ కేసులు పెడుతుందని నువ్వు ఒక్కసారి అన్నా మాట్లాడవా?. పల్నాడు బాధితులతో క్యాంప్ పెట్టారు. కోడెల బాధితుడు అయితే అందులోకి ఆయన ఎందుకు రాలేదు.
పార్టీ మీటింగ్ లకు వస్తానన్నా వద్దని అవమానించింది నువ్వు కాదా?. కాపాడాల్సిన తండ్రి స్థానంలో ఉన్న నువ్వు వదిలించుకోవటానికి ప్రయత్నించింది నువ్వు.. ఆయన మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే ఆయనే వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించావు. ఆయన తరపున ఏ నాయకుడు అయినా మాట్లాడాడా? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చర్చలు జరిపావు. ఆయన్ను సస్పెండ్ చేస్తే నీ నక్క జిత్తుల బతుకు అంతా తెలుసు కాబట్టి భయపడి వదిలేశావు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్ లిస్టు ను పరిశీలించాలి. కోడెల చావుకు ప్రత్యక్షంగా..పరోక్షంగా కారణం అయింది చంద్రబాబే. ఆయనపై ఏ1గా కేసు పెట్టాలి. తెలంగాణ సర్కారు ను కోరుతున్నా. ఎన్టీఆర్ శవయాత్రలో చంద్రబాబుపై చెప్పులు విసిరారు. మూడు నాలుగు లారీలు వచ్చాయి. నీ నీచమైన ఆలోచనలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. పల్నాడు ప్రజలు దాడి చేస్తే ఆ నింద మా మీద మా మీద వేయకు.
కోడెల సూసైడ్ నోట్ ఉందేమో అని పిల్లిలాగా భయపడ్డాడు. బతికుండగా కోడెలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వని నువ్వు..చనిపోయాక శవాన్ని వేసుకుని రాజకీయం చేస్తున్నావు. చంద్రబాబు మేనేజ్ చేయలేని వ్యక్తులకే తెలంగాణ సర్కారు విచారణ బాధ్యతలు అప్పగించి కేసు నిష్పాక్షికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. కోడెల కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. వర్ల రామయ్యతో కోడెలపై ఆరోపణలు చేయించింది చంద్రబాబు కాదా?’ అని కొడాలి నాని ప్రశ్నించారు. కోడెలతో తప్పులు చేయించింది చంద్రబాబే. కోడెలను చంద్రబాబు మానసికంగా వేధించటం వల్లే ఆయన చనిపోయారని ఆరోపించారు.