Telugu Gateway
Politics

ఉద్యోగులపై కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగులపై కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తోక కుక్కను ఊపుతదా.. కుక్క తోకను ఊపుతదా. ఉద్యోగులు ప్రభుత్వాలను డిక్టెట్ చేయలేరు. అలా అయితే ఇక శాసనసభలు ఎందుకు?’ అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఓ భాగమే అన్నారు. అంతే కాని అన్నీ వారిచెప్పినట్లే సాగవన్నారు. ఆర్టీసీ గురించి కూడా కెసీఆర్ సభలో ప్రస్తావించారు. సమ్మెకు వెళితే ఆర్టీసీలో కార్మికులే నష్టపోతారని అన్నారు. భారత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని అన్నారు. అవసరం అయితే వీఆర్ ఓ వ్యవస్థ తీసేస్తామని స్పష్టం చేస్తారు. పోవాల్సిన నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలే పోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కంటే ఎక్కువగా తయారైతే ఎలా అని అన్నారు. వీఆర్ వో లు ఏమైనా పై నుంచి దిగొచ్చిండ్రా? అంటూ కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ చట్టంపై చాలా మంది రైతులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

కౌలు రైతులు భూ యాజమానులు కాదని, పంట పెట్టుబడి గురించి ఏమైనా ఉంటే భూమి యాజమాని, కౌలు రైతులు అవగాహన కుదుర్చుకోవాలన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే టీఆర్ఎస్ పాలన ఎంతో బాగుందని అన్నారు. బిజెపి వస్తే పథకాలు అన్నీ దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్క పొగడ్త కూడా లేదని..తాము ఒక్క మంచి పని కూడా చేయలేదా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజలకు ఎలాంటి ప్రమాదంలేదని..అది ఉంటే కాంగ్రెస్ కు మాత్రమే అని కెసీఆర్ ఎద్దేవా చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు కౌంటర్ గా కెసీఆర్ ఈ మాటలు అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా కాంగ్రెస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని..కొత్త సర్కారు ఇంకా నాలుగు సంవత్సరాలు పైనే ఉంటుందని తెలిపారు. ప్రజల మద్దతు లేకపోతే అధికారులు ఎవరూ ప్రభుత్వాన్ని కాపాడలేరన్నారు.

Next Story
Share it