Telugu Gateway
Cinema

‘జోడీ’ మూవీ రివ్యూ

‘జోడీ’ మూవీ రివ్యూ
X

ఆది సాయికుమార్. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరో. ఈ మధ్యే వచ్చిన బుర్రకథ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. తాజాగా ‘జోడీ’ అంటూ శ్రద్ధా శ్రీనాథ్ తో కలసి ముందుకు వచ్చాడు. సహజంగా ఎవరిని అడిగినా తన తండ్రి గురించి గొప్పగా చెబుతారు. కానీ కపిల్ (ఆది) కి మాత్రం తండ్రి అంటే మంట. దీనికి కారణం తండ్రి తనకు వచ్చే జీతం అంతా క్రికెట్ బెట్టింగ్ ల్లో పోగొడుతూ స్కూల్ లో చదివేటప్పటి నుంచి టూర్ కు వెయ్యి అడిగితే 500 రూపాయలు ఇవ్వటం..కాలనీలో పక్కింటి వాళ్లు దీపావళికి బాక్స్ లకు బాక్స్ లు టపాకాయలు కాలుస్తుంటే కపిల్ మాత్రం ఓ చిన్న బాక్స్ తో సరిపెట్టుకోవాల్సి రావటం. బెట్టింగ్ కు బానిస అయిన తండ్రి కారణంగా పడే కష్టాలతోనే హీరో ఆయనపై ఆగ్రహంతో ఉంటాడు. ఆర్ధిక కష్టాలకు తోడు తన ప్రేమకు కూడా తండ్రి బెట్టింగ్ కారణమే కావటంతో హీరో ప్రేమ కథ ఎలా సుఖాంతం అయింది అన్నదే సినిమా. హీరోయిన్ కాంచనమాల (శ్రద్ధా శ్రీనాధ్) తాత ఓ ప్రమాదానికి గురైతే దగ్గరుండి సాయం చేసి ఆ కుటుంబానికి దగ్గరై తర్వాత ప్రేమలో పడటం అనేది చాలా సినిమాల్లో చూసిందే అయినా కథ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

తొలుత సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన కపిల్..హీరోయిన్ బాబాయిను ఇంప్రెస్ చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరటం..తన తండ్రి బెట్టింగ్ అలవాటు చేయటం వల్లే హీరోయిన్ తండ్రి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని కథ మధ్యలో వెల్లడించటం వంటి ట్విస్ట్ లు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. వెన్నెల కిషోర్ ఓ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వ్యక్తిగా చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కంటే సత్య కామెడీ ఆకట్టుకుంటుంది. బెట్టింగ్ కు బానిసైన హీరో తండ్రి నరేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆది సాయికుమార్ తన పాత్రకు అనుగుణంగా అభినయం చూపించాడు. ఈ సినిమాకు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. జెర్సీ సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె జోడీతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరైంది. తన సహజ నటనతో సినిమాలో హైలెట్ గా నిలిచింది. కాంచనమాల పేరుకు తగ్గట్లు మొబైల్స్ వచ్చిన కొత్తలో ఉన్న నోకియా ఫోన్ రిపేర్ కోసం షాప్ కు వెళ్ళిన సందర్భంగా వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ‘జోడీ’ సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

రేటింగ్.2.75/5

Next Story
Share it