బిజెపిలో జనసేన విలీనం డిసెంబర్ లో
ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన గుంటూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ డిసెంబర్ నాటికి జనసేన బిజెపిలో విలీనం అవుతుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఢిల్లీ వాళ్ళు ఏపీ వస్తారు...ఏపీ వాళ్ళు ఢిల్లీకి వెళతారు. ప్రత్యామ్నాయం వచ్చిన రోజు ఎవరు బ్యాక్ బోన్ అన్నది తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ సీఎం అయితే చూడాలని ఉందన్నారు అన్నం సతీష్. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని జగన్ జాగ్రత్తపడుతున్నారు.
ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, బిజెపి, జనసేన కలసి పోటీచేస్తాయని ప్రకటించారు. ఎన్నికలు పూర్తయి ఇంకా మూడు నెలలు కూడా కాక ముందే అప్పుడే పొత్తులు..ఎత్తులతో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అయినా రికవరి సాధించాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన ఉన్నాయి. అందుకే విరామం లేకుండా రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నాయి.