మెఘా నుంచి జగన్ ఆ 400 కోట్లు కూడా కక్కిస్తారా?!
రివర్స్ టెండరింగ్ ప్రజాధనం ఆదా కోసమే. చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందాలతో ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తోంది. వాటిని అడ్డుకోని ప్రజాధనాన్ని ఆదా చేయటమే ‘రివర్స్’ లక్ష్యం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఏపీ మంత్రులందరిదీ అదే మాట. చంద్రబాబు సర్కారు దోపిడీ ఒప్పందాలను రద్దు చేసి..ప్రజాధనాన్ని ఆదా చేస్తే నిజంగా ఆక్షేపించాల్సింది కూడా ఏమీ ఉండదు. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో సింగిల్ టెండర్ గా వచ్చినా కూడా జగన్ సర్కారు మెఘా ఇంజనీరింగ్ సంస్థకే పనులు కట్టబెట్టడానికి రెడీ అయింది. ఇదే సంస్థ చంద్రబాబు హయాంలో పట్టిసీమ పనులు కూడా చేసింది. అయితే పట్టిసీమ పనుల్లో మెఘా ఇంజనీరింగ్ కు చంద్రబాబునాయుడి సర్కారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకూ దోచిపెట్టింది అని సాక్ష్యాత్తూ జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకుని వైసీపీ నేతలు అందరూ ప్రకటించారు. చివరకు కాగ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. పట్టిసీమలో అడ్డగోలు చెల్లింపులు జరిగాయని నిగ్గుతేల్చింది. మరి ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు మెగా నుంచి పట్టిసీమ కు చెందిన దోపిడీ మొత్తం 400 కోట్ల రూపాయలను కూడా రికవరి చేస్తారా?. లేక వదిలేస్తారా?.
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా సాక్ష్యాత్తూ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాము పట్టిసీమ కు వ్యతిరేకం కాదని...పట్టిసీమలో జరిగిన అవినీతికే వ్యతిరేకం అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండగా బుగ్గన కూడా పట్టిసీమ అవినీతిపై పలుమార్లు స్పందించారు. ఆయన పీఏసీ ఛైర్మన్ గా ఉండి ఈ రికార్డులను పరిశీలించారు కూడా. మరి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు చంద్రబాబు చేసిన పనులన్నీ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేస్తున్నామని చెబుతోంది. మరి అదే సర్కార్ కాగ్ సాక్షిగా దొరికిన మెఘా ఇంజనీరింగ్ నుంచి ఆ డబ్బులు రికవరి చేస్తుందా?. లేక వదిలేస్తుందా? అన్నది వేచిచూడాల్సిందే. కాగ్ చెప్పినా కూడా జగన్ సర్కారు చర్యలు తీసుకోకుండా వదిలేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి రావటం ఖాయం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రజాధనం ఆదా చేయటమే అంతిమ లక్ష్యం అయినప్పుడు ఒక కేసులో ఒకలాగా..మరో అంశంలో మరోలా ఎలా వ్యవహరిస్తారు అన్నది వేచిచూడాల్సిందే.