Telugu Gateway
Politics

పీసీసీ రేసులో లేను

పీసీసీ రేసులో లేను
X

తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నేతలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ముందు వరసలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే కొంత మంది సీనియర్లు మాత్రం కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు వద్దని వాదిస్తున్నారు. మరి అధిష్టానం వారి మాటను వింటుందా?. పార్టీని పరుగులు పెట్టించే వారివైపే మొగ్గుచూపుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. పీసీసీ అధ్యక్షుడి ఖరారు కు రంగం సిద్ధం అయిన దశలో పార్టీ సీనియర్లు కొంత మంది ఢిల్లీలో మకాం వేశారు. అయితే సిఎల్పీ నేత నేత మల్లు భట్టివిక్రమార్క మాత్రం తాను పీసీసీ అధ్యక్ష రేసులో లేనని ప్రకటించారు. అదే సమయంలో ఆయన కెసీఆర్ సర్కారుపైత వ్ర విమర్శలు చేశారు. రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్‌ అమలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్‌ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని భట్టి విమర్శించారు.

గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కొనుక్కుందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ కేంద్ర హోంమంత్రిని కలిసి లోతైన దర్యాప్తు చేయాలని కోరతామని స్పష్టం చేశారు.

Next Story
Share it