Telugu Gateway
Politics

ఈటెల మంత్రి పదవికి ఎర్రబెల్లి హామీనా?

ఈటెల మంత్రి పదవికి ఎర్రబెల్లి హామీనా?
X

‘ఈటెల మంత్రి పదవికి ఢోకా లేదు. గులాబీ జెండా ఓనర్ కెసీఆర్ ఒక్కరే’ ఇవీ తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు. ఇవి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉండి..ఉద్యమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మంత్రి పదవికి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇవ్వటం ఏంటి అన్నది టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈటెల మంత్రి పదవిపై అసలు ఎర్రబెల్లి హామీ ఇవ్వటం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఇది పార్టీ శ్రేణులకు మరింత తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కెటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి హరీష్ రావును పక్కన పెట్టిన విషయంలో చర్చ జరుగుతున్నా అంత వివాదస్పదం కాలేదు. కానీ ఈటెల రాజేందర్ ఏకంగా ‘మంత్రి పదవి నాకు బిక్ష కాదు. గులాబీ జెండా ఓనర్లం. ఎవరితో అండతోనే తాము ఎదగలేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అయితే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ జోక్యంతో వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కన్పిస్తున్నా కూడా అంతర్గతంగా రగులుతూనే ఉందని చెబుతున్నారు. ఓ వైపు ఎర్రబెల్లి గులాబీ జెండా ఓనర్ కెసీఆర్ ఒక్కరే అని చెబుతుంటే ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్ మాత్రం గులాబీ కార్యకర్తలు అంతా గులాబీ జెండా ఓనర్లే అని వ్యాఖ్యానించటం విశేషం. ఇలా పార్టీ నాయకులే తలా ఓ మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందుకు మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా తనకు కెసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని..ఫోన్ లో మాట్లాడానని చెప్పి కలకలం సృష్టించారు. ఇలాంటి పలు అంశాలపై మంత్రులు చాలా మందిలో అసంతృప్తి ఉన్నా ఇప్పటివరకూ ఎవరూ నోరుతెరిచి మాట్లాడలేదు. దీంతో ఈటెల వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ లో ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it