Telugu Gateway
Politics

మోడీకి కాంగ్రెస్ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు

మోడీకి కాంగ్రెస్ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు
X

ప్రదాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటం ఏంటి అనుకుంటున్నారా?. ఆయన పర్యటనలపై వ్యంగస్త్రమే దీని సారాంశం. అక్టోబర్ 27. ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజును కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ అయిన ప్రధాని నరేంద్రమోడిని విమర్శించటానికి ఉపయోగించుకుంది. ప్రధాని మోడీ పలు విదేశీ పర్యటలకు చెందిన 18 ఫోటోలను జత చేసి ‘వరల్డ్ టూరిజం డే’ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు వ్యంగంగా ట్వీట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోడడీ తొలి సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 57 దేశాల్లో 92 సార్లు పర్యటించారని లెక్కలు చెబుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనల కంటే ఇవి రెట్టింపు కావటం విశేషం. గతంలోనూ సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై వ్యంగాస్త్రాలు సంధించారు. విమానాల్లో కూర్చుని కూర్చుని అలవాటు అయి లోక్ సభలో కూడా ప్రధాని సీటు బెల్ట్ కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

అదొక్కటే కాదు..మోడీ ముందు గ్లోబ్ ను పెట్టి..ఇంకా మనం తిరగని దేశాలు ఏమి ఉన్నాయో చూడు అంటూ పైలట్ తో మాట్లాడుతున్నట్లు కార్టూన్లు కూడా వచ్చాయి. ప్రధాని తన విదేశీ పర్యటనల కోసం 2021 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రి వెల్లడించారు. యాధృచ్చికంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు కూడా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అధికార బిజెపి మాత్రం కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతోంది. పలు దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపర్చటానికి ఈ పర్యటనలు ఎంతో దోహదం చేశాయని చెబుతున్నారు. మోడీ పర్యటనలతోనే భారత్ కు పలు దేశాలు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సమయోచిత ట్వీట్ మాత్రం ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు.

Next Story
Share it