Telugu Gateway
Politics

రాజకీయాలపై చిరు సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలపై చిరు సంచలన వ్యాఖ్యలు
X

గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరు బిజెపిలో చేరతారని..మరో పార్టీలో చేరతారని ఎన్నికల ముందు పుకార్లు షికారు చేశాయి. అయితే అవేమీ పట్టించుకోని చిరంజీవి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా చిరు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్ లోనూ చిరు ఇటువైపు తిరిగి చూసే సూచనలు లేవనే అభిప్రాయం కలగకమానదు. రాజకీయాలు అంటే టీ తాగినంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సౌమ్యంగా ఉండే వారు రాజకీయాలకు అసలు సరిపోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలను డబ్బులు శాసిస్తున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చారు. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ సూచన చేశారు.

రాజకీయాల్లోకి వచ్చి నిజాయతీగా ఏమైనా చేద్దామన్నా అది సులభం కాదన్నారు. సొంత నియోజకవర్గంలో తాను, తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా డబ్బు ప్రభావంతోనే ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ విజయం సాధిస్తుందని భావించానని..కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే ఓటమితోపాటు ఎదురుదెబ్బలు తినటానికి కూడా సిద్ధపడితేనే రాజకీయాల్లోకి రావాలన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు మారొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రం సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

Next Story
Share it