Telugu Gateway
Politics

తీహార్ జైలుకు చిదంబరం

తీహార్ జైలుకు చిదంబరం
X

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఇది ఊహించని షాక్. చివరకు తీహార్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. కొంతలో కొంత ఊరట ఏంటి అంటే..అక్కడ ప్రత్యేక గది..ప్రత్యేక సౌకర్యాల కల్పనకు కోర్టు ఓకే చెప్పటం మాత్రమే. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరానికి సీబీఐ కోర్టు గురువారం నాడు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో మాజీ ఆర్థికమంత్రిని తీహార్ జైలుకు తరలించారు.14 రోజులు ఆయన తీహార్‌ జైల్లో గడపాల్సి ఉంటుంది. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఇక సౌకర్యాల విషయానికి వస్తే.. చిదంబరం నేలమీద కూర్చోలేరు కనుక వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఉండాలని కూడా అభ్యర్థించారు. దీంతో జైలు మాన్యువల్‌కు లోబడి చిదంబరం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అన్ని అభ్యర్థనలను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ అనుమతించారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మందులను జైలుకు తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదరంబరం తన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో ఆగస్టు 21 రాత్రి చిదంబరాన్ని సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it