మెఘాకు అడ్డుపడ్డారనే సురేంద్రబాబు బదిలీ
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మీది దోపిడీ అంటే మీది దోపిడీ అని పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. పోలవరంలో తాము వందల కోట్ల రూపాయలు ఆదా చేశామని అధికార పార్టీ చెబుతుంటే ప్రతిపక్షం మాత్రం పోలవరంలో దోపిడీ సాగుతోందని ఆరోపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ కూడా టీడీపీపై ఇదే ఆరోపణలుచేసింది. ఇఫ్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గురువారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..‘ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంత అప్రతిష్ట పాలు కాలేదు. కావాలని మనపై బురదాచల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడు. పీపీఏ ల పై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికి ఉదాహరణలు. పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారు. పోలవరం 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారు.
ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకో లో భాగంగానే..., పొలవరంకి గతంలో ఎక్కువ ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసింది. మెఘా కు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారు. ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోటానికి శ్రీకారం చుడుతున్నారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదు. ప్రయివేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా వారికి అనుమతివ్వటం లేదు. ఇసుక పరిస్థితి దారుణంగా ఉంది. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదలమయం చేస్తున్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడదాం’ అని వ్యాఖ్యానించారు.