చంద్రబాబు హౌస్ అరెస్ట్
ఏపీలో ఎన్నికలు ముగిసి ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ అక్కడ రాజకీయం మాత్రం నిత్యం హాట్ హాట్ గానే సాగుతోంది. అధికార వైసీపీ బాధితులు అంటూ తెలుగుదేశం పార్టీ కొంత మంది శిబిరాలకు తరలించగా..అధికార వైసీపీ కూడా అదే తరహాలో క్యాంప్ నిర్వహించింది. ఇప్పుడు రెండు పార్టీలు ఏపీలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ బుధవారం నాడు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం తలపెట్టింది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సహా పలువురు నేతలు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ కూడా పోటీ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇరువర్గాలు ఒకే చోటకు చేరితే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించిన పోలీసులు గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టడంతోపాటు..యాత్రలకు అనుమతులు లేవని తేల్చేశారు.
అదే సమయంలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినతే చంద్రబాబునాయుడి, నారా లోకేష్ ని హౌస్ అరెస్ట్ చేశారు. వీరితోపాటు పలువురు నేతలను కూడా గృహ నిర్భందం చేశారు. కొంత మంది టీడీపీ నేతలు కృష్ణా బ్యారేజ్ పై ధర్నాకు దిగగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇందులో ఎంపీ కేశినేని నాని తదితరులు ఉన్నారు. ఆత్మకూరు బాధితులకు సంఘీభావంగా తాము యాత్ర పలపెట్టుకుంటే హౌస్ అరెస్ట్ చేయటం దారుణం అని చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా తన నివాసంలో సాయంత్రం 8 గంటల వరకూ దీక్ష చేస్తానని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏకంగా రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.