Telugu Gateway
Andhra Pradesh

ఎంత మంది చెప్పినా మారరా?

ఎంత మంది చెప్పినా మారరా?
X

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి, అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారులు తప్పుడు లెక్కలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. గతంలో ఇలా చేసే కొంత మంది జైళ్ళకు వెళ్ళారని..అధికారుల తీరు ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు. జగన్ సర్కారు పీపీఏల సమీక్షపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘పిపిఏలపై వైసిపి నేతలు, ముగ్గురు అధికారులు పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. నిపుణుల కమిటి అన్నారు, మంత్రివర్గ ఉప సంఘం అన్నారు, చివరికి ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లి అభాసుపాలు అయ్యారు. గత ఐదేళ్లలోనే డిస్కమ్ లకు పెద్దఎత్తున నష్టాలు వచ్చాయని వైసిపి వాళ్లు ఆరోపించారు. 1995కు ముందు ఉన్న గంటల తరబడి కరెంటుకోతల నుంచి మిగులు కరెంటు రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను టిడిపి ప్రభుత్వం మార్చింది. విద్యుత్ సంస్కరణలను అమలు చేసిన తొలిరాష్ట్రం ఏపి. విభజన తరువాత 2014జూన్ కు ముందు కూడా 22.3మి.యూ విద్యుత్ కొరత ఉంది. అలాంటిది విద్యుత్ లోటు అధిగమించి మిగులు రాష్ట్రంగా చేశాం. తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు లభించేలా చూశాం. కాలుష్య రహిత ఇంధనం కోసం సోలార్ పవర్, విండ్ పవర్ ను పెద్దఎత్తున ప్రోత్సహించాం. గత 5ఏళ్లలో ఏపిజెన్ కో, ట్రాన్స్ కో, డిస్ట్రిబ్యూషన్ లో 149అవార్డులతో దేశంలోనే ఏపి నెంబర్ 1స్థాయికి తీసుకువెళ్లాం.

అలాంటిది ఇప్పుడు రూ.20వేల కోట్ల అప్పులు డిస్కంలు చెల్లించాలని, ఏడాదికి రూ.3వేల కోట్లు లోటు ఉందని, అది రూ.7వేల కోట్లు అవుతుందని రకరకాల మాటలతో ప్రజలను మభ్యపెట్టారు. డిస్కమ్ ల నష్టాలకు కారణం 2009కు ముందు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యూనిట్ రూ.11 చొప్పున కొనుగోళ్లు చేసినందువల్లే..ఫ్యూయల్ అడిషనల్ సర్ ఛార్జ్(ఎఫ్ ఏ ఎస్)కూడా విధించారు. 2014లో టిడిపి ప్రభుత్వం వచ్చాక ఆ నష్టాలన్నీ తీర్చాం, ఉదయ్ లో చేరి అప్పులు లేకుండా చేశాం.

2018-19నాటికి జెన్ కో నష్టం రూ.1307.44కోట్లు ఉంటే, ట్రాన్స్ కో లాభం రూ.88.46కోట్లు ఉంది. 2017-18 చివరికి డిస్కమ్ ల ఆర్ధిక పరిస్థితి చూస్తే, ఎస్ పిడిసిఎల్ నష్టం రూ.1,887.68కోట్లు, ఈపిడిసిఎల్ లాభం రూ. 5.09కోట్లు, అన్నీ కలిపినా నష్టం రూ.3వేల కోట్లకు మించిలేదు. సంస్థలకు ఉదయ్ పథకం కూడా ఇచ్చి వ్యవస్థలను కాపాడుకున్నాం. అటువంటిది రూ.20వేల కోట్ల నష్టం తెచ్చామని దుష్ప్రచారం చేశారు. ప్రభుత్వం ప్రచురించిన సమాచారాన్నే విడుదల చేస్తున్నాం.

ప్రధానమంత్రికి చేసిన ఫిర్యాదులో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే అనేది దీనినిబట్టే రుజువైంది. ఈ విధమైన దుష్ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వైసిపి నేతలు దిగజార్చారు. కేంద్రమంత్రి ఆర్ కె సింగ్ రాసిన లేఖలే వీళ్ల ఆరోపణలకు తిరుగులేని జవాబులు. రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్(ఆర్ పిపివో) 5%నుంచి 11%కు గాను, పునరుత్పాదక విద్యుత్ ను 23%పైగా అధిక ధరలకు కొన్నారని ఆరోపించారు. మాకేదో స్వలాభాలు ఉన్నాయని దుష్ప్రచారానికి ఒడిగట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అత్యధిక ఉత్పత్తికి పునరుత్పాదక రంగంలో వెళ్లాం. ఆ విషయాన్నే కేంద్రమంత్రి ఆర్ కె సింగ్ కూడా తన లేఖల్లో చెప్పారు. పునరుత్పాదక ఇంధన కొనుగోళ్ల వల్ల నష్టం వచ్చిందన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపణలను కేంద్రమంత్రే తిప్పికొట్టారు. ఏపిలో యూనిట్ కు రూ.4.84 ఉంటే, రాజస్థాన్ లో రూ.5.76, మహారాష్ట్రలో రూ.5.56, మధ్యప్రదేశ్ లో రూ.4.78 ఉందని ఆయనే తన లేఖలో వెల్లడించారు. విండ్ వెలాసిటి, భూమిధర, ప్రభుత్వ పాలసీలు రాష్ట్రానికి- రాష్ట్రానికి, ప్రాంతానికి-ప్రాంతానికి మారుతుంటాయని చెప్పారు. ఇంతకన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి.

Next Story
Share it