Telugu Gateway
Politics

స్వామివారితోపాటు కెసీఆర్ దర్శనమా?

స్వామివారితోపాటు కెసీఆర్ దర్శనమా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. యాదాద్రిలో స్వామి దర్శనంతోపాటు కెసీఆర్ దర్శనం కూడా చేసుకోవాలని ఆయన భావిస్తున్నారా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. యాదాద్రి గుడిలో స్వామి వారి చరిత్రను పక్కన పెట్టి కల్లకుంట్ల చరిత్రను లిఖించదలిచారా? అంటూ ప్రశ్నించారు. లక్ష్మణ్ శనివారం కార్యకర్తలతో కలిసి యాదాద్రి గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని లక్ష్మణ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే అనుమతించడంతో గుట్టకింద బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ నయా నిజాం పాలన చేస్తున్నారని విమర్శించారు. పవిత్ర క్షేత్రమైన యాదాద్రినే అపవిత్రం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ గొప్ప హిందువునని చెప్తారు

కానీ ఇతర మతాల చిత్రాలు చెక్కడం దేనికి సంకేతమని నిలదీశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ.. గర్భగుడిలోనూ చిత్రాలు చెక్కుతారా అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనంటూ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంపై స్పందిస్తూ దేవుణ్ణి దర్శించడానికి వస్తే ఆంక్షలు పెడుతున్నారనీ, సీఎం కేసీఆర్‌ ఏమైనా ఆదేశాలిచ్చారా అనేది స్పష్టం చేయాలన్నారు. వారంలోపు బొమ్మలను తొలగించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్‌ యజ్ఞయాగాలు చేయడం తన కొడుకు పట్టాభిషేకం కోసమేనని విమర్శించారు. శనివారం ఉదయం బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా యాదాద్రి చేరుకుని అక్కడ చెక్కిన కెసీఆర్ చిత్రాలు పరిశీలించారు. తెలంగాణ సర్కారు కు వారం రోజుల టైమ్ ఇస్తున్నామని..అప్పటి లోగా వాటిని తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Next Story
Share it