Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారుకు ‘బిగ్ షాక్’!

జగన్ సర్కారుకు  ‘బిగ్ షాక్’!
X

ఊహించని షాక్. ఏపీలోని జగన్ సర్కారుకు ఇది బిగ్ బ్లోలాంటిదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకునేందుకు పలు సంస్థలు ముందుకు వస్తాయని సర్కారు ఎన్నో ఆశలు పెట్టుకోగా...అవి కాస్తా ఆవిరి అయ్యాయి. పోలవరానికి సంబంధించి ఓ ప్యాకేజీలో 58 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని..ఇది జగన్ సర్కారు ఘన విజయం అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అంత వరకూ ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రధాన డ్యామ్ పనులతో పాటు...జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి జగన్ సర్కారు 4987 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులకు మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటంటే ఒక్కటే బిడ్ దాఖలు చేయటం ప్రభుత్వ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు అగ్రశ్రేణి సంస్థలతో చర్చలు కూడా జరిపారు. చంద్రబాబు హయాంలో ఉన్నట్లు ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థలు ఏవీ కూడా ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని..నిర్భయంగా టెండర్లలో పాల్గొనవచ్చని సూచించారు. కానీ ప్రీబిడ్ సమావేశానికి హాజరైన ఎనిమిది కంపెనీల్లో ఏడు సంస్థలు మొహం చాటేశాయి.

గడువు ముగిసే సమయానికి కేవలం మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటి మాత్రమే బిడ్ దాఖలు చేసింది. పాత నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్లను అనుమతించకూడదు. అందునా పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో సింగిల్ టెండర్ ను ఓకే చేస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అలా కాదని మళ్ళీ టెండర్లు పిలవాలంటే సర్కారు చెబుతున్నట్లు షెడ్యూల్ ప్రకారం పనులు ప్రారంభించటం మరింత జాప్యం అవుతుంది. ముందుకెళితే ఒక సమస్య..వెనక్కి పోతే ఓ సమస్య. దేశంలో మాంద్యం పరిస్ధితులు కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు ఏమీ చేపట్టడం లేదు. పెద్ద పెద్ద పనులు కాస్తో కూస్తో జరుగుతున్నది ఏపీ..తెలంగాణల్లోనే. మరి ఇంత భారీ ప్రాజెక్టు దక్కించుకోవటానికి కాంట్రాక్ట్ సంస్థలు ఎందుకు ఆసక్తి చూపలేదు?. దీనికి కారణం ఏంటి?. ఏపీలో జగన్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి పీపీఏ ల రద్దు..కాంట్రాక్టుల రద్దుతో ఆయా వర్గాల్లో ఏపీ సర్కారుపై విశ్వాసం దారుణంగా దెబ్బతిన్నది ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. లేదంటే లాభదాయకంగా ఉంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పనులను దక్కించుకునేందుకు సంస్థలు ఎందుకు ఆసక్తిచూపవని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల పనులను టైలర్ మేడ్ కండిషన్లతో అస్మదీయ సంస్థలకు అప్పగించారు. మరి ఇప్పుడు అత్యంత పారదర్శకంగా..అవినీతి లేకుండా పనులు అప్పగిస్తామని చెబుతున్నా కాంట్రాక్ట్ సంస్థలు ఎందుకు రాలేదు?. ఏపీలోని పరిస్థితులపై అవి భయపడుతున్నాయా?. లేక ఎందుకు వివాదాల్లో కూరుకోవటం అనే ఆందోళనతో దూరంగా ఉన్నాయా?. అన్న ప్రశ్నలు ఉధయిస్తున్నాయి. మెఘా ఇంజనీరింగ్ సంస్థకు వేగంగా పనులు చేస్తుందనే పేరున్నా ప్రభుత్వాలతో కుమ్మక్కు అయి అంచనాల్లోనే భారీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా సంస్థ ఎదుర్కొంటోంది. ఇదే వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా..చంద్రబాబునాయుడి సర్కారు మెఘాకు పట్టిసీమ ప్రాజెక్టులో 400 కోట్ల రూపాయల మేర దోచిపెట్టారని ఆరోపణలు గుప్పించారు. మరి అలాంటి సంస్థకు..అదీ సింగిల్ టెండర్ వేసిన సంస్థకు పనులు అప్పగిస్తారా?. అలా అప్పగిస్తే చంద్రబాబు సర్కారుకు..జగన్ సర్కారుకు తేడా ఏముందనే ప్రశ్నలు ఉధయించటం ఖాయం.

Next Story
Share it