Telugu Gateway
Politics

ఏపీలో అప్పుడే పొత్తులపై చర్చలా?

ఏపీలో అప్పుడే పొత్తులపై చర్చలా?
X

ఎన్నికలు అయిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు కానీ ఏపీలో రాజకీయం మాత్రం హాట్ హాట్ గానే సాగుతోంది. ఓ వైపు ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీపై మూడు నెలలు గడవకుండానే విమర్శల జోష్ పెంచితే..టీడీపీ కంటే బిజెపి మరింత దూకుడు మీద ఉంది. ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ఉన్నారు. అదేదో త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి అనే తరహాలో పార్టీలు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు..టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలవలేదనే విషయం మరోసారి 2019 ఎన్నికల్లో రుజువైంది. దీంతో తదుపరి ఎన్నికలకు పొత్తు ఉంటుందనే అభిప్రాయం సర్వాత్రా వ్యక్తం అవుతోంది.

ఈ దశలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం అని చింతకాయల ధృవీకరించినట్లు అయింది.

Next Story
Share it