Telugu Gateway
Andhra Pradesh

వాళ్ళది దోపిడీ..మాది ఆదా

వాళ్ళది దోపిడీ..మాది ఆదా
X

గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రతి దాంట్లో దోపిడీ చేస్తే..జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఆదా చేసే పనులు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తమ అవినీతికి అడ్డుకట్ట పడిందనే తండ్రీ, కొడుకులిద్దరూ ట్విట్టర్ లో గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు మాత్రం ప్రతిక్షణం సీఎం వైఎస్‌ జగన్‌ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని, ఒకవైపు చంద్రబాబు విషం కక్కుతుండగా.. మరోవైపు ఎల్లో మీడియా దానికి వంతపాడుతోందని మండిపడ్డారు. అంబటి గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారని, రివర్స్ టెండరింగ్‌ అద్భుతమైన విజయం సాధించిందన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని కొనియాడారు. పీపీఏల ద్వారా ఏడాదికి రూ. 2,500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వస్తుందని, పీపీఏల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేశారని అంబటి పేర్కొన్నారు. రూ. 87వేల కోట్ల రైతు రుణాలను రూ. 24వేలకోట్లకు కుదించి.. అందులో రూ.15వేల కోట్ల రుణాలు మాత్రమే చంద్రబాబు తనహయాంలో మాఫీచేశారని, 4, 5 విడతల రుణమాఫీ నిధులు ఇవ్వకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి సీఎం వైఎస్‌ జగన్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు.

Next Story
Share it