Telugu Gateway
Andhra Pradesh

బిల్లు వచ్చి 30 రోజులు కాకుండానే వైసీపీ ఎంపీ వార్నింగ్

బిల్లు వచ్చి 30 రోజులు కాకుండానే వైసీపీ ఎంపీ వార్నింగ్
X

ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. పాత సంస్థలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాల్సిందే. ఇందుకు ఆయా కంపెనీలకు మూడేళ్ల వరకూ వెసులుబాటు ఇస్తున్నారు. అప్పటికప్పుడు నిపుణులు అందుబాబులో ఉండరు కాబట్టి ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు జగన్ సర్కారు అసెంబ్లీ లో బిల్లు ఆమోదించి ఇంకా నిండా నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే అధికార వైసీపీకి హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కియా కంపెనీ ప్రతినిధులకు వార్నింగ్ ఇవ్వటం వెనక మతలబు ఏమిటి?. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటానికి ఇంకా ఆ సంస్థకు చాలా సమయం ఉంది. అయినా సరే ఎంపీ ఓ విదేశీ సంస్థ ప్రతినిధులతో అంత దురుసుగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది?. ఇలాంటి చర్యల ద్వారా పారిశ్రామికవేత్తలకు ఏపీ సర్కారు ఎలాంటి సంకేతాలు పంపుతుంది?. ఓ వైపు సోలార్, విండ్ ఎనర్జీ పీపీఏల సమీక్షే దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. మరో వైపు కాంట్రాక్ట్ ల రద్దు కూడా కలకలం రేపుతోంది. ఈ తరుణంలో దేశంలోని పారిశ్రామికవేత్తలకు ఏపీ అంటే ఓ తరహా అభిప్రాయం ఏర్పడటానికి ఏకంగా సర్కారే కారణం అవుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.

దీనికి తోడు సాక్ష్యాత్తూ ఓ ఎంపీ కియా వంటి విదేశీ కంపెనీ నుంచి తొలి కారు బయటకు వచ్చిన రోజు అక్కడే రచ్చ చేయటం వల్ల పారిశ్రామికవర్గాల్లో ఏపీకి ఏ మాత్రం మేలు చేయదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విభజన తర్వాత ఏపీలో మౌలికసదుపాయాలు అంతంత మాత్రమే. ఎయిర్ కనెక్టివిటి పరిస్థితి అయితే మరీ దారుణం. పారిశ్రామికవేత్తలు కోరుకునే అంశాల విషయంలో ఏపీ ఎంతో వెనకబడి ఉంది. ఈ తరుణంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ఎంతో సంయమనంతో వ్యవహరించాలి కానీ..ఇలాంటి చర్యల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. స్థానికులకు పనికిమాలిన ఉద్యోగాలు ఇచ్చారని..కీలకమైన ఉద్యోగాలు అన్నీ ఇతరులకే అప్పగించారని మాధవ్ ఆరోపించారు.

Next Story
Share it