వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మోపిదేవి..ఇక్బాల్..చల్లా

అధికార వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఎవరో తేలిపోయింది. పార్టీ అధిష్టానం అధికారికంగా ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించింది. ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణతోపాటు హిందుపురం నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన ఇక్బాల్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇఛ్చారు జగన్. సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లే నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనా కూడా మోపిదేవి వెంకటరమణను జగన్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనివార్యం అని ముందే తేలిపోయింది. గత ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గం నుంచి పోటీచేసి బాలకృష్ణపై పరాజయం పాలైన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి ఇక్బాల్ కు జగన్ హామీ ఇఛ్చినట్లుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
మరో సీటును చల్లా రామకృష్ణారెడ్డికి కేటాయించారు. అయితే నారా లోకేష్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో తమ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే ఇక్కడ నుంచి ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఈ సారి ఆ ఛాన్స్ రాలేదు. దీంతోపాటు మర్రి రాజశేఖర్ కు కూడా జగన్ గతంలోనే ఎమ్మెల్సీ హామీ ఇఛ్చారు. ఇది ప్రస్తుతం అమలుకు నోచుకోలేదు.