Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జగన్

ఏపీ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఆర్ధిక మంత్రి, శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసి..తెలంగాణకు ప్రయోజనం కల్పించేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కెసీఆర్ నుంచి ప్రయోజనం పొందిన జగన్ అందుకు ప్రతిఫలంగానే వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీకి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ తీసుకువచ్చారని, ఆయన తెచ్చిన ఇమేజిని నాశనం చేయడమే జగన్ డ్రీమ్ అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్వాకాలతో రాష్ట్రం నాశనం అవుతోందన్నారు.

జిఎస్‌టిపై జగన్‌కు అవగాహన లేదని, రాష్ట్ర రాబడి పెంచడంపై దృష్టి లేదన్నారు. వైసీపీ నేరాల చరిత్ర చూసే రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదన్నారు. బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అన్నిరంగాలకు తూట్లు పొడుస్తున్నారని, ఒకవైపు కరువు, మరోవైపు వరదలతో వ్యవసాయం కుదేలైందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, వ్యవసాయ ఆర్ధిక కార్యకలాపాలు తలకిందులయ్యాయన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు లేవని, టీడీపీపై కక్ష సాధింపుపైనే జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసిందని యనమల తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థనే కుప్పకూల్చేసిందని విమర్శించారు. దేశంలో, ఇతర రాష్ట్రాలలో స్వల్ప వృద్ధి ఉన్నప్పుడే ఏపీలో గణనీయమైన వృద్ధి టీడీపీ ప్రభుత్వం సాధించిందని ఆయన కొనియాడారు.

Next Story
Share it