రాజ్ నాథ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు పాకిస్తాన్ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తే అంశంపై ఫోకస్ పెట్టింది. దీనికి పొరుగు దేశం చైనా కూడా వంత పాడుతోంది. ఈ తరుణంలో రాజ్ నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతానికి ముందస్తుగా అణ్వస్త్రాలు వాడకూడదనే నిబంధనకు కట్టుబడి ఉన్నామని..అయితే భవిష్యత్ లో ఏమి జరుగుతుందో చెప్పటం కష్టం అని వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో ఆయనకు రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అణ్వాస్త్రాలను సంధించే విధానంలో ఇప్పటిదాకా భారత్ అనుసరించిన విధానంలో మార్పు రావొచ్చని పేర్కొన్నారు.
‘భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించుకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోంది. నేటికీ ఆ విషయానికి కట్టుబడి ఉంది. అయితే భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపైనే ఈ విధానం ఆధారపడి ఉంటుంది ’అని పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. ‘భారత్ అణ్వాయుధ దేశం. ఈ విషయం ప్రతీ భారతీయ పౌరుడు గర్వించదగినది. ఈ కారణంగా భరత జాతి మొత్తం అటల్‌జీకి రుణపడి ఉంది. పోఖ్రాన్‌లో చేపట్టిన పరీక్షల ద్వారా మన అణ్వాయుధ శక్తి అందరికీ తెలిసింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో...భారత్ అణు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 1998 మార్చి 11, 13 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్ ప్రాంతంలో ఐదు అణుపరీక్షలు నిర్వహించారు.