తెలంగాణ రైతుకు 28 కోట్ల లాటరీ

అదృష్టం అంటే అదే మరి. అది ఎప్పుడు ఎవరి తలుపుతడుతుందో ఎవరూ ఊహించలేరు. ఎంత కష్టంపడ్డా రాని ఫలితం ఒక్కోసారి అలా ఊహించకుండానే షాకింగ్ ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణ రైతుకు అచ్చం అలాగే జరిగింది. ఈ కథలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. ఈ రైతు దుబాయ్ వెళ్ళి సంపాదించుకుని వెనక్కి వద్దామనుకున్నారు. కానీ ఏమి జరిగిందో చూడండి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కాల, పద్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే విలాస్ 45 రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చేశాడు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన విలాస్.. రెండేళ్లుగా అక్కడి ప్రముఖ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న అతడు... లాటరీ టికెటు కొనుగోలు చేసే అలవాటును మానుకోలేకపోయాడు.
తన చేతులో డబ్బులు లేకపోవడంతో భార్య పద్మ దగ్గరి నుంచి రూ. 20వేలు తీసుకుని.. లాటరీ టికెట్లు కొనుగోలు చేయాల్సిందిగా దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడు రవికి చెప్పాడు. విలాస్ పేరు మీద రవి మూడు టికెట్లు కొనుగోలు చేశాడు. అంతే అందులోని ఓ టికెటు.. విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతను భారీ లాటరీ గెలుపొందినట్టు విలాస్‌కు ఫోన్ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లాటరీలో విలాస్ ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు(రూ. 28.4 కోట్లు) సొంతం చేసుకున్నాడు. విలాస్ మాత్రం ఈ సంతోష క్షణాలకు తన భార్యే కారణమని చెప్పాడు.