‘ప్రభాస్’ను టార్గెట్ చేసిన టీడీపీ!

తెలుగుదేశం పార్టీ తాజా టార్గెట్ హీరో ప్రభాస్ ‘సాహో’ సినిమా. అసలు టీడీపీకి ..సాహో సినిమాకు సంబంధం ఏంటి అంటారా?. అక్కడే ఉంది అసలు కథ. తాజాగా చెన్నయ్ లో ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన హీరో ప్రభాస్ ఏపీ సీఎం జగన్ పాలనపై కామెంట్ చేశారు. జగన్ యువ సీఎం అంటూ..ఆయన మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని..అయినా ఏపీ ఎంతో సుందరమైన ప్రాంతం అంటూ..వేచిచూద్దామని వ్యాఖ్యానించారు. ఈ వార్తలు మీడియాలో వచ్చాయి. అంతే తెలుగుదేశం పార్టీ నాయకులు..సోషల్ మీడియా టీమ్ ప్రభాస్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేసింది. తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం ప్రస్తుతం ప్రభాస్ సాహో ను టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తోంది. రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరోకు అయినా తర్వాత అన్నీ ఫ్లాప్ లే వచ్చాయని..దీనికి ఎవరూ మినహాయింపు కాదంటూ సాహో పై నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.
బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచారం బిజీలో ఉండగా...జగన్ పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు ఆయన్ని టార్గెట్ చేశాయి. టీడీపీకి దూరమైన సమయంలో ఎన్టీఆర్ పై కూడా అప్పట్లో టీడీపీ శ్రేణులు బాగున్న సినిమాలు కూడా బాగాలేదని ప్రచారం చేసి..కలెక్షన్లపరంగా ఆ సినిమాలను కొంత మేర దెబ్బతీశాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లు కూడా దొరక్కుండా చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు టీడీపీ శ్రేణుల టార్గెట్ ప్రభాస్ అయ్యారు. మరి టీడీపీ సోషల్ మీడియా వింగ్ చేసే ప్రచారం ఏపీలో ప్రభాస్ సినిమా సాహో పై ప్రభావం చూపించగలదా?. ఈ విషయం తేలాలంటే ఆగస్టు 30 వరకూ వేచిచూడాల్సిందే. ప్రభాస్ పెద్దనాన్న అయిన కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా టీడీపీ శ్రేణుల కోపానికి కారణం అయిందని చెబుతున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇంకా నిండా మూడు నెలలు కూడా కాలేదు. ఎవరో ఏదో అన్నారని టీడీపీ శ్రేణులు ఇంత ఉడికిపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఎలా తట్టుకోలగలరు?. పోనీ నిజంగా ప్రభాస్ జగన్ పాలన బాగా లేదు అన్నాడే అనుకుందాం...వెంటనే సీట్లోకి చంద్రబాబు ఏమి వచ్చి కూర్చోవటం సాధ్యం కాదు కదా?.