శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం
రెండు కార్లు. ఒక కారులో పెద్దలు. మరో కారులో పిల్లలు. పిల్లలు ఉన్న కారు పెద్దల కారును ఫాలో కాకుండా మరో రూటులో వెళ్ళింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఓ క్యాబ్ డ్రైవర్ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ముంబయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకుంది. తల్లిదండ్రులు తొలుత మగ్గురు పిల్లలను ఒక క్యాబ్‌లో ఎక్కించారు. తరువాతి క్యాబ్‌లో తల్లిదండ్రులు బయలుదేరారు. అయితే పిల్లలు ఉన్న క్యాబ్ డ్రైవర్.. పారిపోయేందుకు ప్రయత్నించాడు.
దీంతో తల్లిదండ్రులు కారును వెంబడించారు. దీంతో అతడు పిల్లల్ని, లగేజ్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే డ్రైవర్‌తో పాటు క్యాబ్‌లో ఉన్న అతడి స్నేహితుడిని మాత్రం పిల్లల తల్లిదండ్రులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇలా విమానాశ్రయ ప్రయాణికులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించటం పెద్ద కలకలం రేపింది.