ట్విట్టర్ లో పిలిస్తే పలికే సుష్మాస్వరాజ్ ఇక లేరు

పనుల కోసం రాజకీయ నేతలు, అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా పనులు కాని పరిస్థితులు ఎన్నో. చాలా మందికి ఇలాంటి అనుభవాల ఉంటాయి. కానీ ట్విట్టర్ వేదికగా ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే చాలు..అలా వెంటనే పనులు చేస్తూ అందరి మదిని దోచుకున్న చిన్నమ్మగా పిలుచుకునే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణం పాలయ్యారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లోని ఎమెర్జెన్సీ వార్డ్ కు తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు. లోక్‌సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రమే ఆమె ట్వీట్ చేశారు.
‘నరేంద్ర మోదీజీ.. చాలా చాలా కృతజ్ఞతలు ప్రధాని గారు. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే హుటాహుటిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సుష్మాస్వరాజ్ మృతికి రాష్ట్రపతి కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. ‘సుష్మాజీ మృతి వార్త నన్నెంతో షాక్‌కు గురిచేసింది. ప్రజాజీవితంలో గొప్ప దార్శనికతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నేతను దేశం కోల్పోయింది’ అని కోవింద్ ట్వీట్ చేశారు. ఎన్డీయే 1 ప్రభుత్వంలో తన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఆమె స్పందించిన విధానం చూసిన తర్వాత ఆమెకు ఎంతో మంది అభిమానులుగా మారారు.