జాతీయ భద్రతను సంక్షోభంలోకి నెట్టారు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించటం విశేషం. పార్లమెంట్ లో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది సీనియర్లు కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. జాతీయ భద్రతను సంక్షోభంలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను నిర్భందించి... వారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత దేశం భూములతో నిర్మితం కాలేదని, ప్రజలతో ఏర్పడిందని..ఈ రకంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని జమ్మూ కశ్మీర్‌ను ఏడిపించడం జాతీయ సమగ్రత అనిపించుకోదు అని ట్వీట్ చేశారు.