Telugu Gateway
Politics

ట్రిపుల్ తలాక్ ఇక నేరం

ట్రిపుల్ తలాక్ ఇక నేరం
X

పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఇక మూడుసార్లు తలాక్ చెపితే అది నేరంగా పరిగణిస్తారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం నాడు సంతకం చేశారు. దీంతో బిజెపి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం ట్రిపుల్‌ తలాక్‌ ఇక నుంచి శిక్షార్హమైన నేరం కానుంది. గత ఫిబ్రవరిలో జారిచేసిన ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమల్లోకి వచ్చింది.

తలాక్‌ ఏ బిదత్‌తోపాటు ఇతర రూపాల్లో ఉన్న సత్వర తలాఖ్‌ విధానాలు ఇకపై చెల్లబోవు. మహిళలకు తమ భర్తలు వెనువెంటనే విడాకులు ఇచ్చేవిధానం ఇకపై నేరం కానుంది. మౌఖికంగాగానీ, లిఖితపూర్వకంగాగానీ, లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఇచ్చే సత్వర తలాక్‌ విధానం ఇకపై చెల్లబోదు, చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్‌ అని పేర్కొంటూ ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తే.. దానిని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు మూడేళ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది.

Next Story
Share it