Telugu Gateway
Andhra Pradesh

పోలవరం టెండర్లు పిలిచారు..ఎవరు వస్తారో?

పోలవరం టెండర్లు పిలిచారు..ఎవరు వస్తారో?
X

జగన్ సర్కారు తాను అనుకున్నట్లే ముందుకెళుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖను ఏమాత్రం పట్టించుకోకుండా ‘రివర్స్ టెండర్’ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం పనులతో పాటు పవర్ హౌస్ లకకు కలిపి 4987 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. రివర్స్ టెండర్ విధానంపై పీపీఏ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయటం వల్ల వ్యయం పెరగటంతోపాటు...పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినా సరే ప్రభుత్వం మాత్రం పోలవరం పనుల కోసం కొత్తగా టెండర్లు పిలిచింది. అయితే ఇప్పుడు ఈ పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అగ్రశ్రేణి నిర్మాణ కంపెనీలు అన్నీ ఇంచుమించు జగన్ సర్కారు నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నవే. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతోంది. అదే సమయంలో మెగా ఇంజనీరింగ్ కూడా రివర్స్ టెండరింగ్ బాధితుల జాబితాలో ఉంది. నవయుగా సంగతి సరేసరి. అగ్రశ్రేణి సంస్థలు అన్నీ ఏదో కారణంతో ఏపీలో పనులు చేపట్టేందుకు ఆసక్తితో లేవని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరి ఈ పోలవరం టెండర్లలో ఎవరు పాల్గొంటారు?. పాల్గొనే సంస్థ సకాలంలో అంటే టైమ్ లైన్స్ ప్రకారం పనులు చేయగలుగుతుందా? అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం. తాజాగా టెండర్లకు చెప్పుకోదగ్గ సంస్థలు బిడ్స్ దాఖలు చేయకపోయినా అది జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అయితే ఈ అంశంపై ఇప్పుడే అంచనాకు రావటం కష్టం అవుతుంది. ఏది ఏమైనా కొత్త టెండర్లలో ఏమైనా తేడాలు వస్తే మాత్రం జగన్ సర్కారు అటు కేంద్రంతోపాటు...రాష్ట్రంలో విపక్షాల దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. పాత రేట్లతో ఇప్పుడు పనులు చేపట్టడం అనేది జరిగే పని కాదని వాదనా ఉంది. మరి పోలవరం ప్రధాన పనుల్లో జరిగే నష్టాన్ని వేరే రకంగా సర్దుబాటు చేసేందుకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా?. లేక పక్కాగా టెండర్ కే కట్టుబడి ఉంటారా?. ఏ కంపెనీ వస్తుందో తేలితే కానీ ఈ విషయాలు అన్నీ స్పష్టం కావు.

Next Story
Share it