Telugu Gateway
Politics

రివర్స్ ఎఫెక్ట్..పోలవరం పనులు ఏడాది జాప్యం!

రివర్స్ ఎఫెక్ట్..పోలవరం పనులు ఏడాది జాప్యం!
X

జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులను 2021కి పూర్తి చేస్తామని చెబుతోంది. రివర్స్ టెండరింగ్ వల్ల ఏ మాత్రం జాప్యం జరగదని వాదిస్తోంది. అయితే ఇంజనీర్లు మాత్రం అందుకు భిన్నమైన వాదన విన్పిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల తక్కువలో తక్కువగా ఏడాది ఎక్కుక సమయం పడుతుందని..ప్రభుత్వం చెబుతున్నట్లు 2021 నాటికి పనులు పూర్తి చేయటం ఏ మాత్రం సాధ్యంకాదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇందుకు వారు పలు అంశాలను ఉదహరిస్తున్నారు. కాంట్రాక్టర్ అలాగే కొనసాగి ఉంటే మిషనరీ అక్కడ ఉండేది. సీజన్ అనుకూలించిన వెంటనే పనులు ప్రారంభించేవారు. కానీ ఇఫ్పుడు కొత్త సంస్థను ఎంపిక చేయటం వల్ల కొత్తగా టెండర్ దక్కించుకునే ఆ సంస్థ భారీ మెషినరీని తిరిగి ప్రాజెక్టు సైట్ లో అమర్చుకోవాల్సి ఉంటుంది. కొత్త మిషనరీ అమరిక..పనులు ప్రారంభించటం చాలా సంక్లిష్టలతో కూడిన అంశం అని చెబుతున్నారు.

ఇది ఒకెత్తు అయితే ఇప్పుడు గోదావరి వరదతో పోలవరంప ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది. పనులు ప్రారంభించాలంటే ప్రాజెక్టు ప్రాంతం నుంచి నీటిని తొలగించాలి (డీవాటరింగ్). ఇది కూడా భారీ వ్యయంతో కూడిన వ్యవహారం అని చెబుతున్నారు. ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థ అయితే ఈ పని చేయాల్సిన బాధ్యత ఆ కంపెనీపైనే ఉంటుంది. కొత్త సంస్థకు పనులు అప్పగించటం వల్ల ఈ వ్యయం కూడా అదనం అవుతుంది. రివర్స్ టెండరింగ్ వల్ల జరిగే జాప్యం, అదనపు వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చెబుతోంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పోలవరం పనులు తక్కువలో తక్కువగా ఏడాది పాటు జాప్యం అవుతాయని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు వ్యయం పెరిగితే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది. అదే జరిగితే జగన్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు.ప్రాజెక్టు పనుల్లో ఏడాది జాప్యం అవటం వల్ల ఈ మేరకు రైతులకు..పరిశ్రమలకు అందే ప్రయోజనాల్లో కూడా నష్టం ఉంటుంది కదా? అని ఇంజనీర్లు సందేహాలు లేవనెత్తుతున్నారు.

Next Story
Share it