Telugu Gateway
Politics

కాశ్మీర్ లో కొత్తశకం ప్రారంభం

కాశ్మీర్ లో కొత్తశకం ప్రారంభం
X

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లో కొత్తశకం ప్రారంభం కాబోతుందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన అత్యంత కీలకమైన ఈ అంశంపై దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కాశ్మీర్ రాబోయే రోజుల్లో దేశ టూరిజం హబ్ గా మారుతుందని అన్నారు. బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ కూడా తమ సినిమాలకు కాశ్మీర్ ను కేంద్రంగా చేసుకోవాలని ప్రధాని సూచించారు. కాశ్మీర్‌లో కేంద్రపాలన తాత్కాలిమేనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక కేంద్ర పాలన ఉండబోదని స్పష్టం చేశారు. త్వరలోనే కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎందరో మహానీయులు స్వప్నం సాకారమైందన్నారు. కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుందన్నారు.

కాశ్మీర్‌, లడ్డాఖ్‌ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఆర్టికల్‌ 370 వల్ల కాశ్మీర్‌, లడ్డాఖ్‌ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇంతకాలం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు ఒకటే భారత్‌- ఒకటే రాజ్యంగం అనే కల నెరవేరిందన్నారు. ఆర్టికల్‌ 370 జమ్మూ కశ్మీర్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ఈ ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అన్యాయం వెనుక పాక్‌ హస్తం ఉందని విమర్శించారు. ఇకపై కాశ్మీర్‌ అభివృద్ది పథంలో ప్రయాణిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఆర్టికల్‌ 370,35ఏల వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఏమీ ఒరగలేదు. కాశ్మీర్‌లోని పిల్లలకు కనీసం చదువు కూడా అందలేదు. ఈ ఆర్టికల్స్‌ ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగింది.

కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించారు. ఆర్టికల్‌ 370ని పాకిస్తాన్‌ ఆయుధంలా వాడుకుంది. 42,000 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా ప్రయోజనం చేకూర్చే చట్టాలు కాశ్మీర్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఆర్టికల్‌ 370 ఉగ్రవాదాన్ని పోత్సహించడమే కాకుండా, కుటుంబ రాజకీయాలకు, అవినీతికి మాత్రమే తోడ్పడింది. కాశ్మీర్‌కు సాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కాశ్మీర్‌లో కార్మికులకు సరిగా వేతనాలు అందడం లేదు. మైనార్టీలకు రక్షణ కల్పించే చట్టాలు అక్కడ ఉండవు. దేశమంతా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి. కానీ కాశ్మీర్‌లో ఇవేమీ ఉండవు. కానీ ఇకపై.. దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై కాశ్మీర్‌లో కూడా వర్తిస్తాయి. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశామ’ని స్పష్టం చేశారు. కాశ్మీర్, లడ్డాఖ్ ప్రగతిలో స్థానికులు భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Next Story
Share it