Telugu Gateway
Andhra Pradesh

అమరావతి నుంచి రాజధానిని ఎవరూ కదపలేరు

అమరావతి నుంచి రాజధానిని ఎవరూ కదపలేరు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం నాడు అమరావతిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ ప్రాంతం నుంచి ఎవరూ కదపలేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా వైసీపీ అధినేతలా వ్యవహరిస్తున్నారు. విభజన సమయంలో జరిగిన రాజకీయాలే రాజధాని వ్యవహారంలోనూ జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటన వల్లే రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.రాజధానికి, రైతులకు అన్యాయం చేస్తే తాను ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలసి పరిస్థితిని వివరిస్తానన్నారు. తాను బలవంతపు భూసేకరణను వ్యతిరేకించానే తప్ప..అమరావతిలో రాజధానిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని పవన్ తెలిపారు. నాలుగు ప్రాంతాల్లో రాజధానులు, కొండవీటి వాగు వరద ముప్పు అంటూ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు.

పవన్ బేతపూడి, నిడమర్రు, కురగల్లు గ్రామాల మీదుగా రాజధాని గ్రామాలకు వెళ్లారు. వివిధ దశల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు, యూనివర్శిటీల భవనాలు, హైకోర్టు పరిసరాలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల క్వార్టర్స్, కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం పరిశీలించారు. కొండవీటి వాగు వంతెన నిర్మాణం దగ్గర పవన్ మీడియాతో మాట్లాడుతూ... “ వైసిపీ ప్రభుత్వం రాజధాని మారుస్తుందంటూ ఈ ప్రాంత రైతులు కొంత మంది నన్ను కలిశారు. రాజధాని అంశం భావోద్వేగాలతో కూడుకున్న వ్యవహారం. 33వేల ఎకరాలకు పైగా భూములను సమీకరణలో రైతులు ఇచ్చి త్యాగం చేశారు. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. రాజధాని మార్పు మీద బలమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ అంశం మీద ప్రకటన చేయాలి. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? ఒకవేళ వేరే చోటుకు తరలిస్తే అది ఏ ప్రాతిపదికపై తరలిస్తారు? రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం మీద స్పష్టత ఇవ్వాలి. దీన్ని పొలిటికల్ గేమ్ గా చూస్తే ప్రజలు నష్టపోతారు. మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులని అర్ధం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. రాజధాని తరలిస్తే భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకి విలువ ఏముంటుంది. నిర్మాణాలు సగంలో ఉన్నాయి... తరలిస్తే రైతులకు భూములు తిరిగి ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.

వాస్తవానికి కొత్త ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇవ్వాలి అనుకున్నాం. 90 రోజులకే జగన్ రెడ్డి పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేను 90 రోజులకే రోడ్డు మీదకి వచ్చేలా మీరే చేశారు. జగన్ రెడ్డి వైసిపి అధినేతగా పాలన సాగిస్తున్నారు. తనను తాను ముఖ్యమంత్రిగా భావించడం లేదు. ఈ ప్రాంత రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఓ పార్టీకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా స్పష్టమైన ప్రకటన చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు. అలా అని ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. ప్రజలు తిరుగులేని విజయాన్ని అప్పగించినా జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నట్టు కనబడుతున్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి. గత పాలకులు అక్రమాలు చేసారంటూ రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు. అవినీతి జరిగిందని తేలితే విచారణ జరిపించండి. రుజువైతే చర్యలు తీసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరి వైసీపీ ప్రభుత్వంలో కూడా రాత్రులు ఇసుక అమ్ముకుంటున్నారు అని ఆరోపించారు.

Next Story
Share it