భారత రాయబారిని బహిష్కరించిన పాక్

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత సర్కారు తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ కుతకుతలాడుతోంది. అంతర్జాతీయంగా పాక్ వాదనకు ఏ మాత్రం మద్దతు లభించకపోవటంతో..వరస పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ తనను తాను రక్షించుకునే పనిలో పడింది ఇమ్రాన్ ఖాన్ సర్కారు. అందులో భాగంగానే భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని నిర్ణయించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు కూడా చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు పాకి స్తాన్ లోని భారత రాయబారిని బహిష్కరించింది. పాకిస్థాన్ హై కమిషనర్ ను భారత్ కు పంపరాదని నిర్ణయించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పాక్ భారత్ పై అక్రోశం వెళ్ళగక్కుతోంది. జమ్మూకాశ్మీర్ విభజన కూడా పాక్ కు మింగుడుపడటం లేదు. కాశ్మీరీల హక్కుల పరిరక్షణకు తాము అండగా నిలబడతామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.