నవయుగ ‘టార్గెట్’ వెనక అసలు కారణం అదేనా?
ఏపీలో వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్న ఏ కంపెనీపై లేనంత కోపం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒక్క నవయుగాపై ఎందుకు ఉందో తెలుసా?. దీనికి వైసీపీ వర్గాలు అత్యంత కీలకమైన విషయాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఈ సంస్థకు భారీ ఎత్తున పనులు అప్పగించిన విషయం తెలిసిందే. అంతే కాదు..ఆ సంస్థ తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తారనే ధీమాతో ఓ కంపెనీ చేయాల్సిన పని కంటే ‘రాజకీయం’ ఎక్కువ చేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అది ఎలా అంటే పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పలు నియోజకవర్గాలతోపాటు..గోదావరి జిల్లాల్లో ఆ సంస్థ ప్రతినిధులు అప్పటి అధికార పార్టీ తరపున నిధులు పంపిణీ చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు జగన్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పక్కా సమాచారం రావటంతో ఈ విషయాన్ని సీఎం జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. ఓ కాంట్రాక్టర్...ప్రభుత్వం మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో నవయుగా..చంద్రబాబుల మధ్య సంబంధం ఉంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదని..కానీ ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధుల ఓటమి కోసం కాంట్రాక్ట్ కంపెనీలు పనిచేయటం ఏమిటన్నది జగన్ వాదనగా చెబుతున్నారు. బడా బడా కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు నిధులు ఇవ్వటం మామూలే అయినా..ఓ పార్టీ తరపున ఓ సంస్థ పనిచేయటం మాత్రం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు.
ఇదే కారణంతో మిగిలిన సంస్థలతోపాటు జగన్ నవయుగాపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా పనులు చేయటంలో ఆ సంస్థ స్పీడ్ గా ఉంటుందని..నిర్దేశిత గడువులో పనిచేసే ట్రాక్ రికార్డు ఉన్నా జగన్ ఈ అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవటానికి సిద్ధపడటం లేదని ఓ సీనియర్ నేత వెల్లడించారు. పోలవరంలో చంద్రబాబునాయుడి సర్కార్ నామినేషన్ పై అప్పగించిన పనుల రద్దుతో పాటు ఏకంగా మచిలీపట్నం పోర్టు పనులను రద్దు చేస్తూ కూడా జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.