Telugu Gateway
Cinema

‘మన్మథుడు2’ మూవీ రివ్యూ

‘మన్మథుడు2’ మూవీ రివ్యూ
X

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమా టాలీవుడ్ లో ఎంత బ్లాక్ బస్టర్ మూవీనో అందరికీ తెలిసిందే. దానికి స్వీకెల్ లో తెరకెక్కించిన మన్మథుడు2 సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏ మేరకు అంచనాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. కానీ మన్మథుడు2 సినిమాతో నాగార్జున ప్రేక్షకులను నిరాశపర్చాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మన్మథుడు2 అంత నిరాశాజనక సినిమా మరొకటి లేదనే చెప్పొచ్చు. వయస్సు దాటిపోయిన కొడుకుకు పెళ్లి చేయాలనుకునే తల్లి(లక్ష్మీ). పెళ్ళి అంటే ఇష్టం లేని తనయుడు(నాగార్జున). చివరకు తల్లి కోరిక మేరకు గర్లఫ్రెండ్ గా నటించేందుకు హీరోయిన్(రకుల్ ప్రీత్ సింగ్) తో ఒప్పందం. ఆ ఒప్పందంలో ఎన్నో ట్విస్ట్ లు. ఇలాంటి సినిమాలు తెలుగులో ఇప్పటికే బొచ్చెడు వచ్చాయి. కానీ గర్లప్రెండ్ గా నటించటం కోసం వచ్చిన అమ్మాయి ..నిజంగానే ప్రేమలో పడటం..చివరలో పెళ్ళికి అంగీకరించటం.

కథ సుఖాంతం. ఇదీ సంక్షిప్తంగా మన్మథుడు2 సినిమా. నాగార్జున వంటి సీనియర్ హీరో తన సినిమా సక్సెస్ కోసం బూతు డైలాగ్ ల మీద ఆధారపడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అయినా సరే మన్మథుడు 2 సినిమాలో ప్రేక్షకుడుకి మంచి సినిమా చూస్తున్న పీల్ కలిగించే సన్నివేశాలే కన్పించవు. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పొచ్చు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉంది అంటే నాగార్జున తన లుక్ ను కుర్ర హీరోలకు ధీటుగా మెయింటెన్ చేశారు. కానీ అప్పుడప్పుడు వయస్సు ప్రభావం కన్పిస్తూనే ఉంది. సినిమాలో చూపించిన పోర్చుగల్ అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సినిమాలో హైలెట్ ఏదైనా ఉంది అంటే పోర్చుగల్ అందాలే. నాగార్జున వంటి సీనియర్ హీరోను డైరక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ ఏ మాత్రం తన ప్రభావం చూపించలేకపోయారు. మన్మథుడు సినిమాతో పోలిస్తే అందులో 10 శాతం ఎంటర్ టైన్ మెంట్ కూడా మన్మథుడు2లో ఉండదనే చెప్పొచ్చు. హీరోయిన్లు కీర్తిసురేష్, సమంతలు ఇందులో ఎందుకు నటించారో..ఏమి నటించారో కూడా అర్ధం కాదు. ఈ మధ్య సంపూర్ణేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. మన్మథుడు2 టిక్కెట్లు దొరకని వారంతా తన సినిమాకు రావాలని కోరాడు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు నిశ్చింతగా ఉండొచ్చు.

రేటింగ్ 1.5/5

Next Story
Share it