కాశ్మీర్ అసెంబ్లీ అనుమతి అవసరం లేదా?

కాశ్మీర్ కు స్వయంతప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో బిజెపిపై విరుచుకుపడింది. ఈ నిర్ణయం తీసుకోవటానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ అసవరం లేదా? అని ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ఎలా చేస్తారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. కాశ్మీర్ ను విభజించిన తీరు సరిగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించినట్లు ఆయన గుర్తుచేశారు. అలాగే కశ్మీర్‌ను విడగొట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర శాసనసభ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధమైన ఎలాంటి విధానాలను కాశ్మీర్ విషయంలో కేంద్రం పాటించలేదని ప్రశ్నించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని సంస్థానాలు స్వతంత్రగా ఉన్నాయని, నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చొరవతోనే అవన్ని దేశంలో విలీనమయ్యాయని తివారి వ్యాఖ్యానించారు. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్ 370ని తీసివేయడం సరికాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను కూడా ఇలానే తీసేస్తారా అని ప్రశ్నించారు. మనీష్ తివారీ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలను షా తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తేల్చిచెప్పారు.