Telugu Gateway
Politics

జెపీ నడ్డా కాదు..పచ్చి అబద్దాల అడ్డా

జెపీ నడ్డా కాదు..పచ్చి అబద్దాల అడ్డా
X

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె పీ నడ్డాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని..2023లో సీఎం కెసీఆర్ కు వాస్తు ఏంటో తెలుస్తుంది అంటూ ఆదివారం నాటి బహిరంగ సభలో జె పీ నడ్డా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కెటీఆర్ బిజెపిలో కర్ణాటకలో సాగించిన నాటకాలు ఇక్కడ సాగవన్నారు. తెలంగాణ కర్ణాటక కాదని వ్యాఖ్యానించారు. జె పీ నడ్డా పేరు తాను అసలు వినలేదని..ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన జె పీ నడ్డా కాదు..అబద్ధాల అడ్డా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళలో హైదరాబాద్ కు ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. పెన్షన్లకు టీఆర్ ఎస్ సర్కారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కేంద్రం ఇచ్చేది అరకొరే అని తెలిపారు. మా పథకాలన్నీ కాపీ కొట్టి ఇఫ్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పేరును జలశక్తి అభియాన్ గా మార్చారన్నారు.

కూకట్ పల్లి నియోజకవర్గ డివిజన్ ,బూత్ స్థాయి టీఆర్ఎస్ కమిటి సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెటీఆర్ స్పీచ్ లోని ముఖ్యాంశాలు..‘ఇది తెలంగాణ బిడ్డల అడ్డా ...నడ్డా,బీజేపీ ల ఆటలు సాగవు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారా ? తెలంగాణ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరు ?కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడి ఏడుస్తున్నారు ?. తెలంగాణ వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజేక్టు కట్టుకోవడానికే. అవినీతి అని బీజేపీ నేతలు గొంతు చించుకుంటున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి.గతంలో కాంగ్రెస్ నేతలు ఇలానే మాట్లాడారు. ఒకాయన కాంగ్రెస్ అధికారం లోకి రాక పోతే గడ్డం తీయనన్నారు ..టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చింది ..ఆయన గడ్డం అలానే ఉంది. టీఆర్ఎష్ ప్రజలకు మంచి చేసింది కనుకే మరోసారి అధికారం లోకి వచ్చింది.బీజేపీ దుష్ప్రచారం ,కుట్రలు కుతంత్రాల రాజకీయాలను టీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కోవాలి.

మతం ,కుల రాజకీయాలతో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోంది. కేంద్ర సంస్థలు టీఆర్ఎస్ పథకాలను పొగుడుతుంటే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ..ఎవరు కరెక్టో ఆలోచించుకోవాలి. కేంద్రం ఆయుష్మాన్ భారత్ స్కీం ఓ బక్వాస్ స్కీం. ఆయుష్మాన్ కన్నా ఆరోగ్య శ్రీ పథకమే మంచిది. .ఆరోగ్య శ్రీ ని మరింత పటిష్టం గా ప్రభుత్వం అమలు చేస్తుంది. బీజేపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తుత్తునీయలు చేయాలి. తెలంగాణ ను బంగారు తెలంగాణను ,హైదరాబాద్ ను విశ్వనగరం గా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం. అవసరమైతే కూకట్ పల్లి పరిధి లో కార్పొరేటర్ల సంఖ్య పెంచే విషయాన్ని సీఎం కెసిఆర్ తో చర్చిస్తా’ అని తెలిపారు.

Next Story
Share it