‘కౌసల్యకృష్ణమూర్తి’ మూవీ రివ్యూ
క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాలు అన్నీ ఈ మధ్య హిట్స్ కొడుతున్నాయి. అందుకు ఉదాహరణలే మజిలీ..జెర్సీ మూవీలు. మజిలీలో అక్కినేని నాగచైతన్య క్రికెట్ కోసం తప్పించే యువకుడిగా నటిస్తాడు. జెర్సీ సినిమాలో హీరో నానిదీ అదే కథ. ఎంతో ఇష్టపడే క్రికెట్ ను వదిలేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా. అదే ‘కౌసల్యా కృష్ణమూర్తి’. ఈ సినిమాలో క్రికెట్, వ్యవసాయాన్ని మిక్స్ చేసి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది తమిళ సినిమా కణా కు రీమేక్ అయినా సరే ప్రేక్షకులను ఆలరిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా కథ విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్ ఓ రైతు. ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం. ఓ సారి ఇండియా మ్యాచ్ ఓడిపోవటం చూసి కంటతడి పెడతాడు. తన తండ్రి కంట తడి పెట్టడాన్ని చూసిన కౌసల్య (ఐశ్వర్యా రాజేష్) ఎలాగైనా క్రికెట్ లోకి అడుగుపెట్టి విజయం సాధించాలని తపన పడుతుంది.
దీనికి తల్లి రూపంలో ఎదురయ్యే అడ్డంకులు. ఆడపిల్లకు అసలు క్రికెట్ ఏంటి అంటూ ఆ గ్రామంలో ఎదురయ్యే సవాళ్ళు. ఇలా ఎన్నో సమస్యలను అధిగమించి కౌసల్య క్రికెటర్ గా ఎలా విజయం సాధించింది. క్రికెట్ కు..వ్యవసాయాన్ని మిక్స్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో క్రికెట్ కోచ్ గా నటించిన శివ కార్తికేయ మంచి నటన కనపర్చారు. ‘ ఈ లోకం గెలుస్తాను అని చెపితే వినదు. గెలిచిన వాడు చెపితే వింటుంది. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు’ అంటూ కౌసల్యలో స్పూర్తి నింపే డైలాగ్ యూత్ కు ప్రేరణగా నిలుస్తుంది. తండ్రి కన్న కల కోసం పాటుపడే కౌసల్య పాత్రలో ఐశ్యర్యా రాజేష్ అద్భుతంగా నటించిందనే చెప్పాలి. కళ్లతోనే భావాలను పలికించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రొఫెషనల్ క్రికెటర్‌లా కనిపించేందుకు ఐశ్వర్య పడిన తపన ఈ సినిమాలో కన్పించింది.
భూమినే ప్రాణంగా నమ్ముకునే రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా నటించాడు. రైతు పడే కష్టాలను చూపించే సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. కృష్ణమూర్తి భార్యగా, కౌసల్య తల్లి సావిత్రి పాత్రలో ఝాన్సీ తన అనుభవాన్ని చూపించింది. ఆమెకు పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఈ సినిమాలో దొరికందని చెప్పొచ్చు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ముగ్గురూ పోటీపడి మరీ నటించారని చెప్పాలి. . కౌసల్యను ప్రేమిస్తూ.. ఆమె లక్ష్య సాధనలో సాయపడే సాయికృష్ణ పాత్రలో కార్తీక్ రాజుది పరిమిత పాత్రే. ఒరిజినల్ కథలో ఉన్న ఫీల్‌ను ఏ మాత్రం మిస్ చేయకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. ఓవరాల్ గా చూస్తే కౌసల్య కృష్ణమూర్తి పిల్లల్లో స్పూర్తి నింపే సినిమా అని చెప్పొచ్చు.
రేటింగ్. 3.25/5