Telugu Gateway
Politics

దేవినేని ఉమా నాలుక కోస్తాం

దేవినేని ఉమా నాలుక కోస్తాం
X

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్దం పర్దం లేని ఆరోపణలు చేస్తూ,అసత్య ప్రచారాలు సాగిస్తే ఉమా నాలుకు కోస్తామని ఆయన హెచ్చరించారు. ఉమా లాంటి చేతకాని దద్దమ్మను తాను ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీకొడుకులిద్దరూ దివాళా తీయించారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా ఆ ఇద్దరిలో మార్పు రావటం లేదన్నారు.

అర్ధం లేని ట్వీట్లతో లోకేష్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాలారిష్టాలని అధిగమించి ప్రజాసంక్షేమాన్ని చూస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అభివృద్ధికి సహకరించకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమా తన హయాంలో చేతకాని దద్దమ్మ మాదిరి వ్యవహరించి ,ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఉమా మహేశ్వరరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని పార్ధసారధి హెచ్చరించారు.

Next Story
Share it